Monday, October 15, 2018

పత్తి కొనుగోళ్లకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్



-342 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
-పంట కొన్న మూడురోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బు
-మార్కెటింగ్‌శాఖ పకడ్బందీ చర్యలు


పత్తి కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టేందుకు మార్కెటింగ్‌శాఖ చర్యలు చేపడుతున్నది. భారత పత్తి సంస్థ రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసిన వెంటనే తక్‌పట్టి వివరాలను సహా మొత్తం పక్రియ వేగంగా జరిగేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. ఈ ఏడాది పంట కొనుగోలుచేసిన మూడురోజుల్లోనే రైతు ఖాతాలో సొమ్ము జమచేసేందుకు మార్కెటింగ్‌శాఖ ఏర్పాట్లుచేసింది. రైతుబంధు సొమ్ము పంపిణీకి వ్యవసాయశాఖ.. రైతుల బ్యాంకు ఖాతాలు సేకరిస్తున్నందున వాటిని తీసుకొని, ఆ ఖాతాల్లోనే పత్తి సొమ్ము జమచేయాలని నిర్ణయించింది.సాగు విస్తీర్ణం పెరుగడంతో ఈ ఏడాది కొనుగోలు కేంద్రాల సంఖ్యను 342కు పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటివరకు ఏడు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటును మంత్రి హరీశ్‌రావు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, కోటి ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అత్యధికంగా 44.91 లక్షల (107 శాతం) ఎకరాల్లో పత్తి సాగైంది. గులాబీపురుగు దాడి చేయడం, వర్షాలు సరిగాలేక పత్తి ఎదగలేదు. ఈ ఏడాది 35.92 లక్షల టన్నుల పత్తి ఉత్పత్తి అవుతున్నదని వ్యవసాయశాఖ అంచనా వేయగా.. అది 30 లక్షల టన్నుల కంటే తక్కువకు పడిపోయే అవకాశముంది. అంతర్జాతీయంగా పత్తి దిగుబడులు పడిపోయే అవకాశాలుండటంతో పత్తికి మంచిధర ఉంటుందని మార్కెటింగ్‌శాఖ వర్గాలు భావిస్తున్నాయి. పత్తి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) గతేడాది రూ.4,320 ఉండగా, ఈసారి రూ.5,450కు పెరిగింది. బయటి మార్కెట్లో కనీసం రూ.5,700 ధర వస్తుంది.

పత్తి కొనుగోలు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు: లక్ష్మీబాయి, మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్
పట్టాదారు పాసుపుస్తకం లే కపోయినా రైతులు మండల వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో) వద్ద ధ్రువీకరణపత్రం తీసుకొస్తే పత్తిని కొంటాం. కొనుగోలు కేం ద్రాల వద్ద రైతుల వేలిముద్ర స్కానర్‌ను ఏర్పాటు చేశాం. పత్తి కొనుగోలు, సకాలంలో సొమ్ము అందజేత వంటి వాటిని ప్రత్యేక అధికారులు పర్యవేక్షిస్తారు. దళారుల ప్రమేయానికి చెక్‌పెడుతారు. సీసీఐ పూర్తిస్థాయిలో కొనడంలో మంత్రి హరీశ్‌రావు కీలకంగా వ్యవహరించారు.


ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్‌, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe)  చేసుకోండి.

No comments:

Post a Comment